India: బాబ్రీ మసీదు కూల్చివేతకు నేటితో 26 ఏళ్లు.. గట్టి భద్రతను ఏర్పాటుచేసిన పోలీసులు!

  • శౌర్య దివస్ కు పిలుపునిచ్చిన ఆరెస్సెస్
  • బ్లాక్ డేగా ప్రకటించిన ముస్లిం సంఘాలు
  • ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించిన అధికారులు

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేసి నేటికి 26 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఈ రోజు శౌర్య దినోత్సవం నిర్వహిస్తామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయోధ్యతో పాటు ఉత్తరప్రదేశ్ అంతటా భారీగా పోలీసులను మోహరించారు.

మరోవైపు బాబ్రీ కూల్చివేతను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు ‘బ్లాక్ డే’ పేరిట నిరసన ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఈ విషయమై యూపీ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమాలకు అనుమతులు జారీ చేశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించామని తెలిపారు.

గతంలో ఏం జరిగిందంటే..
భారత్ పై దండయాత్రకు వచ్చిన బాబర్ ఆదేశాలతో ఈ మసీదును క్రీ.శ.1527లో నిర్మించారు. ఆలయాన్ని కూలగొట్టి ఈ మసీదును నిర్మించారని 1853లో తొలిసారి గొడవ చెలరేగింది. 1949 ప్రాంతంలో మసీదులో సీతారాముల విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై హిందువులు, ముస్లింలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మసీదును మూసివేయాలన్న కోర్టు.. ప్రార్థనలు కొనసాగేందుకు మాత్రం  అనుమతించింది. రామమందిరం నిర్మాణం కోసం బీజేపీ సీనియర్ నేత అద్వానీ 1990లో రథయాత్ర చేయడంతో బిహార్ లో ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది.

1992, డిసెంబర్ 6న దాదాపు 1,50,000 మంది కరసేవకులు బాబ్రీ మసీదును గునపాలు, సమ్మెటలతో కూల్చివేశారు. ఈ దుర్ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన మత ఘర్షణల్లో దాదాపు 2,000 మంది అమాయక హిందూ, ముస్లిం ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రామజన్మభూమి కేసును 2010, సెప్టెంబర్ లో విచారించిన అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని3 ముక్కలుగా చేసి ముస్లింలకు, హిందువులకు, నిర్మోహీ అఖారా సంస్థకు పంచింది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టు 2011లో కొట్టివేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను 2019, జనవరిలో విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

More Telugu News