Andhra Pradesh: నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఎఫెక్ట్.. పిలేరు టీడీపీ మాజీ ఇన్ చార్జీ ఇక్బాల్ మొహమ్మద్ రాజీనామా

  • టీడీపీని 25 సంవత్సరాలు నమ్ముకున్నాం
  • నల్లారి కుటుంబంపై పోటీ చేసి నష్టపోయాం
  • ఆదుకుంటామన్న చంద్రబాబు మాటతప్పారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి షాక్ తలిగింది. పిలేరు నియోజకవర్గం మాజీ ఇన్ చార్జీ ఇక్బాల్ మొహమ్మద్ సహా 21 మంది నేతలు అధికార పార్టీకి రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోఇక్బాల్ మాట్లాడుతూ.. టీడీపీకి తమ జీవితాన్ని ధారపోశామనీ, 25 సంవత్సరాలు పార్టీకి సేవ చేశామని తెలిపారు. 2014 ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబీకులపై పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు తమపై ఒత్తిడి చేశారని వెల్లడించారు.

కిరణ్ కుటుంబీకులపై పోటీ చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచిపోయినా ఇప్పటివరకూ తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, కిరణ్ సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి తెచ్చారనీ, నియోజకవర్గం ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును చాలాసార్లు కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామనీ, అయినా పట్టించుకోలేదని వాపోయారు. బీజేపీతో విడిపోయాక బాబుకు ముస్లింలపై ప్రేమ పొంగుకువస్తోందని విమర్శించారు.

More Telugu News