India: ఎన్నికల ప్రచారం ముగిసిపోయిందిగా..ఇక పార్ట్ టైమ్ ప్రధాని బాధ్యతలు చేపట్టండి!: మోదీకి రాహుల్ చురకలు

  • దమ్ముంటే మీడియా సమావేశం పెట్టండి
  • హైదరాబాద్ లో మీడియా మిత్రులతో భేటీ అయ్యా
  • ట్విట్టర్ లో స్పందించిన కాంగ్రెస్ అధినేత

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌, రాజ‌స్తాన్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం అయిపోయింద‌నీ, ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగంగా ఉన్న ప్ర‌ధాని బాధ్య‌త‌ల‌పై ఆయన దృష్టి పెట్టాల‌ని చుర‌క‌లు అంటించారు. నిజంగా ద‌మ్ముంటే మీడియా స‌మావేశం నిర్వ‌హించి విలేక‌రుల ప్ర‌శ్న‌కు జ‌వాబు ఇవ్వాల‌ని స‌వాల్ విసిరారు.

సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.. ‘ప్రియమైన ప్ర‌ధాన‌మంత్రి మోదీ గారికి.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ‌, రాజ‌స్తాన్ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసినందున మీ పార్ట్ టైమ్ ఉద్యోగమైన ప్ర‌ధాని బాధ్య‌త‌ల‌పై దృష్టి సారించేందుకు స‌మ‌యం కేటాయిస్తార‌ని ఆశిస్తున్నా.

మీరు భార‌త ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇప్ప‌టికే 1654 రోజులు గ‌డిచిపోయాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మీడియా స‌మావేశం కూడా నిర్వ‌హించ‌లేదు. తెలంగాణ‌లో మ‌హాకూట‌మి ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిశాక హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఈ రోజు పాల్గొన్నా. దీన్ని మీరోసారి ప్ర‌య‌త్నించండి. మ‌న మీద ప్ర‌శ్న‌లు దూసుకురావ‌డం చాలా బాగుంటుంది’ అని సూచించారు. 

More Telugu News