TRS: టీఆర్ఎస్ నేతలు టీవీ9 కార్లలో డబ్బును తరలిస్తున్నారు.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సంచలన ఆరోపణ!

  • టీఆర్ఎస్ హయాంలో రైతులు నాశనమయ్యారు
  • మహిళా సంఘాలకు రూ.10 లక్షల రుణమిస్తాం
  • కోదాడ సభలో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు నాశనం అయిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షలు రుణం మాఫీ చేస్తామనీ, మొదటి సంవత్సరం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. తొలి ఏడాదే మెగా డీఎస్సీ కింద 20,000 టీచర్ ఉద్యోగాల కోసం ప్రకటనలు జారీ చేస్తామన్నారు.

 తెలంగాణలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకు రూ.లక్ష చొప్పున గ్రాంట్ జారీచేస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రతీ సంఘానికి రూ.10 లక్షలు రుణం ఇస్తామన్నారు. దళితులు, గిరిజనులకు ఇంటి కోసం 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. కోదాడలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లాడారు.

తెలంగాణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లేందుకు సిద్ధం అవుతోందని ఉత్తమ్ విమర్శించారు. ఈ రెండు రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలనీ, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులను టీవీ9 వాహనాల్లో, పోలీస్ కార్లలో, అంబులెన్సుల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.

More Telugu News