Telangana: కేసీఆర్ ఓ నల్లతాచు.. లగడపాటి రాజగోపాల్ చెప్పింది జరిగి తీరుతుంది!: రేవంత్ రెడ్డి

  • మహాకూటమి విజయం తథ్యం
  • రైతులెవరూ బ్యాంకులకు అప్పులు కట్టొద్దు
  • కాంగ్రెస్ నేతల హయాంలో పందులు మాత్రమే పెరిగాయి

తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలో అదే తేలిందని వ్యాఖ్యానించారు. రైతులెవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఎవ్వరినీ ఏనాడూ కమీషన్లు అడగలేదనీ, ప్రజలను వేధించలేదని వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరాస్ పేటలో ఈ రోజు నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లత్రాచులాంటి వ్యక్తి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఓ ఉగ్రవాదిలా పోలీసులు తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కొడంగల్ ప్రజలు 9 సంవత్సరాల క్రితం నాటిన మొక్క తానని వ్యాఖ్యానించారు. తనను నరకడానికి సిద్ధిపేట నుంచి ఒకరు, షాబాద్ నుంచి ఇంకొకరు గొడ్డళ్లు తీసుకుని బయలుదేరారని విమర్శించారు.

తనను కొడంగల్ ప్రజలు ఆశీర్వదించడంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల దెబ్బకు ప్రతీ ఊర్లో ఇప్పుడు పందులు కనిపిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు 100 అడుగుల గోతిలో పాతిపెట్టే రోజులు వచ్చాయన్నారు.

More Telugu News