Telangana: తెలంగాణ ఎన్నికలను చంద్రబాబు శాసించబోతున్నారు.. ఆ 25 శాతం ఓట్లు కీలకం కానున్నాయి!: లగడపాటి

  • రాజకీయాల్లో గెలుపోటములు సహజం
  • హరీశ్ రావుతో నాకు గొడవలు ఉన్నాయి
  • టీఆర్ఎస్ కు అన్నివర్గాలు వ్యతిరేకమయ్యాయి

రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజమనీ, వీటిని నేతలెవరూ తీసుకోవద్దని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు.టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగులు, విద్యార్థులు, టీచర్లు, కార్మికులు అందరూ వ్యతిరేకంగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ 30 మంది నేతలు తన ఇంటికి వచ్చి తెలంగాణలో వాస్తవ పరిస్థితిని చెప్పాల్సిందిగా ఒత్తిడి చేశారనీ, అయినా తాను ఎక్కడా నోరు జారలేదని వ్యాఖ్యానించారు.

కొందరు నేతల ఒత్తిడితోనే తాను సర్వే ఫలితాలను మార్చానని మంత్రి కేటీఆర్ ఆరోపించడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ప్రస్తుతం తన ఆర్జీ ఫ్లాష్ టీమ్ నిజామాబాద్ లో సర్వే చేస్తోందని, ఫలితాలు రేపు ఉదయం అందుతాయని చెప్పారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో లగడపాటి మాట్లాడారు.

గత ఐదేళ్లలో కేటీఆర్ ను తాను ఎన్నడూ కలవలేదనీ, చివరిసారి ఈ ఏడాది సెప్టెంబర్ లో మాత్రం ఆయనతో తన బంధువు ఇంట్లో భేటీ అయ్యానని రాజగోపాల్ అన్నారు. తాను తిరుపతిలో మీడియాతో మాట్లాడగానే దూషణలు మొదలయ్యాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా తనకు రూపాయి లాభం ఉండదని వ్యాఖ్యానించారు. నిజాలు చేదు, తీపిగా ఉంటాయనీ, వాటిని జీర్ణించుకోవడంలోనే నాయకత్వ లక్షణాలు బయటపడతాయని చెప్పారు.

తనకు, హరీశ్ రావుకు గతంలో గొడవలు జరిగాయనీ, అయితే కేటీఆర్ తో మాత్రం ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేటీఆర్ యువకుడనీ, మంచి టాలెంట్ ఉన్నవాడని ప్రశంసించారు. ప్రజల నాడి పసిగట్టే కనిబెట్టే సామర్థ్యం ఉన్నందునే తాను సర్వే చేసి ఫలితాలు నిర్వహించానని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పారు.

తన మొబైల్ లో తెలంగాణలో ఎవరు గెలుస్తారో, ఓడిపోతారో మొత్తం వివరాలు ఉన్నాయనీ, ఒకవేళ దాన్ని బయటపెడితే రాష్ట్రంలో గందరగోళం చెలరేగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి 25 శాతం ఓటింగ్ ఉందనీ, తాజాగా మహాకూటమితో పొత్తు నేపథ్యంలో ఆ 25 శాతం ఓట్లు ఫలితాలను శాసించనున్నాయని చెప్పారు.

More Telugu News