Matrimony: 'నిన్నే పెళ్లాడతా' అంటే నమ్మిన హైదరాబాద్ యువతి... ఆపై దారుణ మోసం!

  • మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో యువతి ప్రొఫైల్
  • డాక్టర్ గా పరిచయం చేసుకున్న నైజీరియన్ మోసగాడు
  • డబ్బిచ్చి బోరుమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

హైదరాబాద్‌ కు చెందిన ఓ యువతిని, పెళ్లి పేరు చెప్పి అడ్డంగా దోచేశాడో నైజీరియన్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నగర మహిళ ఒకరు తన వివాహం నిమిత్తం 'షాదీ.కామ్'లో తన పేరు నమోదు చేయించుకుంది. ఆపై కొన్ని రోజులకు ఆమె సెల్ ఫోన్ నంబర్ కు వాట్స్ యాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. తన పేరు ఆయుష్ త్యాగి అని, గ్రేటర్ నోయిడాలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నానని చెప్పాడు. తాను హైదరాబాద్ కు చెందిన వాడినేనని, అక్కడ స్థిరపడి క్లినిక్ పెట్టుకోవడం తన ఉద్దేశమని, ఇష్టపడితే వివాహం చేసుకుందామని చెప్పాడు.

దీనికి సదరు యువతి అంగీకరించింది. తాను ఆగస్టు 8న వస్తున్నానని త్యాగి చెప్పాడు. అదే రోజు ఆమెకు 82911 97915 నంబర్ నుంచి ఫోన్ చేసి పూజ అనే మహిళ మాట్లాడింది. తాను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారిణిగా పరిచయం చేసుకుంటూ, త్యాగి అనే వ్యక్తి రూ. 3 కోట్లతో దొరికిపోయాడని, మనీ లాండరింగ్ చట్టం కింద పట్టుబడ్డాడని చెప్పింది.

కస్టమ్స్ క్లియరెన్స్ కావాలంటే రూ. 5.45 లక్షలు చెల్లించాలని చెప్పగా, ఆ మాటలు నమ్మిన బాధితురాలు, పూజ చెప్పిన బ్యాంకు ఎకౌంట్ కు ఆ డబ్బు పంపింది. ఆపై ఎంత ట్రై చేసినా త్యాగి, పూజ ఫోన్లు కలవక పోవడంతో తనను మోసం చేశారని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది.

 ఆపై కేసును విచారించిన సైబర్ క్రైమ్ విభాగం బాధితురాలికి త్యాగిగా పరిచయమైన వ్యక్తి అసలు పేరు అబేద్ ఒడారా (30) అని, అతనో నైజీరియన్ అని, తన మిత్రుడు, భార్యతో కలసి ఢిల్లీలో ఉంటూ, మ్యాట్రిమోనీ వెబ్ సైట్లపై కన్నేసి మహిళలను మోసం చేస్తుంటాడని పోలీసులు తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అతన్నుంచి ల్యాప్‌ టాప్‌ లు, స్మార్ట్ ఫోన్లు, వైఫై రూటర్లు, ట్యాబ్‌ లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

More Telugu News