atm cards thefpt gand arest: ఘరానా మోసగాళ్లు... ఏటీఎం కార్డుతో వుడాయించి నగదు డ్రా చేస్తున్న ఇద్దరి అరెస్టు

  • ఐదు కార్డులు, 86 వేల నగదు స్వాధీనం
  • ఏటీఎంకి వచ్చే వారికి సహాయం చేసినట్లు నటన
  • వీలు చిక్కితే నకిలీ కార్డులు చేతిలో పెట్టి అసలు వాటితో పరారు

ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాయడం, డబ్బు డ్రా చేయడంపై అవగాహన లేక ఎవరైనా సహాయం అడిగితే పిన్ తెలుసుకున్న అనంతరం ఓ నకిలీ కార్డు వారి చేతిలో పెట్టి అసలు కార్డు ఎత్తుకు వెళ్లడం, అనంతరం ఆ ఖాతాలో డబ్బు డ్రా చేసి మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్, నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఐదు ఏటీఎం కార్డులు, 86 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే... హర్యానా రాష్ట్రానికి చెందిన సాబేర్‌, సోఫిక్‌, సాకిబ్‌, అబ్బాస్‌ స్నేహితులు. తమ దొంగతనాలకు ఏటీఏం కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్రాలకు వచ్చే వారిలో నగదు డ్రా చేయడంపై అంతగా అవగాహన లేనివారికి సాయం చేస్తున్నట్లు నటిస్తారు. కార్డు పిన్‌ నంబరు తెలుసుకుంటారు. వెంటనే కార్డు యజమాని దృష్టి మరల్చి కార్డుతో వుడాయిస్తున్నారు.

అక్టోబరు 31న హైదరాబాద్‌ నగరానికి వచ్చిన వీరు నలుగురూ క్యాబ్‌ను అద్దెకు తీసుకున్నారు. మొఘల్‌పురా, పటాన్‌చెరు, రాంచంద్రాపురం, చాంద్రాయణ గుట్ట ప్రాంతాల్లో నాలుగు ఏటీఎం కేంద్రాల వద్ద పలువురిని నమ్మించి వారి ఏటీఎం కార్డులు తస్కరించారు.

నవంబరు 1న లక్డీకపూల్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో బహూదూర్‌పురాకు చెందిన మహమ్మద్‌ ఇబ్రహీం నగదు తీస్తుండగా అతన్ని మాయమాటల్లో పెట్టారు. అతని అసలు కార్డు తస్కరించి నకిలీ కార్డు చేతుల్లో పెట్టి వుడాయించారు. రెండు రోజుల తర్వాత తాను మోసపోయానని గుర్తించిన ఇబ్రహీం, నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ను విచారించారు. నిందితులను ఓ లాడ్జి నుంచి పికప్‌ చేసుకున్నట్లు అతను చెప్పడంతో వల వేసి ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

More Telugu News