Agusta Westland: ధోవల్ విజయమే... చాపర్ కుంభకోణం మధ్యవర్తి మైకేల్‌ ను అప్పగించిన యూఏఈ!

  • రాజకీయ ప్రకంపనలు పుట్టించిన అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ కుంభకోణం
  • 2012లో ఇండియా నుంచి పారిపోయిన జేమ్స్ మైకేల్
  • 2017లో దుబాయ్ లో అరెస్ట్
  • ఎట్టకేలకు భారత్ కు రప్పించిన సీబీఐ, ఈడీ

రాజకీయ ప్రకంపనలు పుట్టించిన అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ చాపర్ల కుంభకోణంలో మధ్యవర్తి అయిన క్రిస్టియన్‌ జేమ్స్‌ మైకేల్‌ (57)ను ఎట్టకేలకు ఇండియాకు తేగలిగాం. ఆయన్ను అప్పగించేందుకు యూఏఈ అంగీకరించగా, మంగళవారం రాత్రి ఆయన్ను దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకు వచ్చినట్టు సీబీఐ పేర్కొంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ స్వయంగా రంగంలోకి దిగి చేపట్టిన ఆపరేషన్‌ కారణంగానే మైకేల్‌ ను ఇండియాకు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.

బ్రిటన్‌ దేశస్తుడైన మైకేల్‌, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీ నుంచి రూ. 225 కోట్ల ముడుపులు అందుకున్నారని ఈడీ రెండేళ్ల క్రితమే చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే స్కామ్ లో మైకేల్‌ తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మరో ఇద్దరు బ్రోకర్లపైనా ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. మైకేల్ ను ఇండియాకు తీసుకు వచ్చే విషయంలో ధోవల్ నేతృత్వంలో సీబీఐ డైరెక్టర్‌ ఎం నాగేశ్వర రావు ఈ ఆపరేషన్‌ ను సమన్వయపరిచారు, జాయింట్‌ డైరెక్టర్‌ సాయి మనోహర్‌ టీమ్, స్వయంగా దుబాయ్ వెళ్లి మైకేల్ ను ఇండియాకు తీసుకువచ్చింది.

కాగా, ఈ స్కామ్ లో మైకేల్ పాత్ర 2012లోనే వెలుగులోకి వచ్చింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ కు చాపర్ల డీల్ ను దక్కేలా చేసేందుకు వైమానిక దళ చీఫ్‌ ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబీకులతో కలసి మైకేల్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. విచారణ నుంచి తప్పించుకోవడానికి మైకేల్ విదేశాలకు వెళ్లిపోగా, పారిపోయిన నిందితుడిగా సీబీఐ ప్రకటించింది. ఆపై 2015లో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాగా, ఆపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో దుబాయ్ లో మైకేల్ అరెస్ట్ అయి, అప్పటి నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నాడు మైకేల్.

More Telugu News