Telangana: కోదండరాం పెద్ద మూర్ఖుడు.. అందుకే మహాకూటమిలో చేరి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు!: కేసీఆర్

  • మహాకూటమి ఓ మాయాకూటమే
  • కోదండరాం పరిస్థితి దారుణంగా మారింది
  • చంద్రబాబును ఇక్కడ విలన్ గా చూస్తున్నారు

తెలంగాణలో టీఆర్ఎస్ కు పోటీగా విపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి ఓ మాయాకూటమిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. మహాకూటమి తమకు పోటీనే కాదనీ, భారీ మెజారిటీతో తెలంగాణలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమిలో చేరకముందు తెలంగాణ జనసమితి(టీజేఎస్) పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా తయారయిందో ఈ రోజు పేపర్ చదివితే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కోదండరాం తన మిత్రుడనీ, తామిద్దరం తెలంగాణ ఉద్యమంలో కలిసి పోరాడామని గుర్తుచేసుకున్నారు. ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడారు.

కోదండరాం ఓ మూర్ఖుడనీ, అందుకే మహాకూటమిలో చేరి చాలాపెద్ద తప్పు చేశారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మూర్ఖత్వం కారణంగా చంద్రబాబును తీసుకొచ్చారన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును దూషిస్తారనీ, విలన్ గా భావిస్తారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని టీపీసీసీ నేతలు పొత్తు పెట్టుకుని తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘బహుబలి లాంటి మీ కటౌట్ ను నేను చూశాను. మీకు చాలా ప్రజాభిమానం ఉంది’ అని సర్దేశాయ్ చెప్పగా కేసీఆర్ ముసిముసి నవ్వులు నవ్వుతూ థ్యాంక్యూ అంటూ ఇంటర్వ్యూను ముగించారు.

More Telugu News