అసలు కేసీఆర్ మనిషేనా? నల్లగొండలో భయపడి గజ్వేల్ కు పారిపోయాడు!: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

04-12-2018 Tue 16:07
  • కోమటిరెడ్డి చాలా మంచి వ్యక్తి
  • ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించండి
  • ఎన్నికల ప్రచారంలో దర్శకుడు రవిబాబు  
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మించిన మంచి మనిషి లేరని నటుడు, దర్శకుడు రవిబాబు కితాబిచ్చారు. ఇలాంటి వ్యక్తి పొరపాటున ఓడిపోతే అంతకుమించిన దురదృష్టం ఇంకోటి ఉండదని వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల హయాంలో అద్భుతమైన అభివృద్ధి చోటుచేసుకుందన్నారు. నల్లగొండ మున్సిపాలిటీకి నిధులు విడుదల చేయకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మంత్రి కేటీఆర్ ను అడగాలని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లాలో ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రవిబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ గత 20 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వెనుకపడిందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనిషేనా? అని ప్రశ్నించారు. నల్లగొండలో పోటీచేస్తే తమ చేతిలో ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్ గజ్వేల్ కు పారిపోయారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ ఆత్మగౌరవం గెలుస్తుందో, లేక కేసీఆర్ దోపిడీ చేసిన వందలకోట్ల సొమ్ము గెలుస్తుందో డిసెంబర్ 11న తేలుతుందని ప్రకటించారు.