Telangana: మాకు 580 ఎకరాల పొలం ఉండేది.. నేను పుట్టిన ఇల్లు విస్తీర్ణమే మూడెకరాలు ఉండేది!: సీఎం కేసీఆర్

  • ఇప్పుడేమో 600 గజాల ఇంట్లో ఉంటున్నా
  • రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నాను
  • చంద్రబాబు చెత్త రాజకీయాలు చేస్తారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన తరహాలో తాను చెత్త రాజకీయాలు చేయననీ, ప్రజా రాజకీయాలు మాత్రమే చేస్తానని చెప్పారు. తాను తెలంగాణలో ధనికుల కుటుంబంలో పుట్టాననీ, తమకు 580 ఎకరాల సాగుభూమి ఉండేదని వెల్లడించారు. తాను పుట్టి,పెరిగిన ఇల్లు మూడెకరాల్లో విస్తరించి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు తనకు 600 గజాలు ఉన్న ఇల్లు మాత్రమే హైదరాబాద్ లో మిగిలిందన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక తాను ఆస్తులను పోగొట్టుకున్నానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి కాకముందే 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశానని పేర్కొన్నారు. ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడారు.

‘తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నగదు వరద పారిస్తున్నారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఆంధ్రాలో అక్రమంగా సంపాదించిన సొమ్మును చంద్రబాబే భారీగా వెదజల్లుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆంధ్రా, తెలంగాణలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-107 స్థానాలతో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యమనీ, మహాకూటమికి ఓటువేస్తే తెలంగాణ చీకటిగా మారిపోతుందని హెచ్చరించారు.

More Telugu News