imran khan: కశ్మీర్ సమస్యపై వాజ్ పేయి నాతో ఏం చెప్పారంటే..: ఇమ్రాన్ ఖాన్

  • 2004లో బీజేపీ ఓడిపోకపోతే కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేదని వాజ్ పేయి చెప్పారు
  • కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే విషయం ఆయన వ్యాఖ్యలతో అర్థమైంది
  • త్వరలో ఎన్నికలు ఉండటం వల్లే.. భారత్ చర్చలకు సిద్ధంగా లేదు

అత్యంత సున్నితమైన కశ్మీర్ సమస్యపై భారత మాజీ ప్రధాని వాజ్ పేయి తనతో చెప్పిన మాటలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. ఇస్లామాబాద్ లో టెలివిజన్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ, 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోకపోతే కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేదని తనతో వాజ్ పేయి అన్నారని తెలిపారు. ఆ సందర్భంలో తమతో పాటు భారత మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కూడా ఉన్నారని చెప్పారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరు దేశాలు దగ్గరగా ఉన్నాయనే విషయం వాజ్ పేయి వ్యాఖ్యలతో తనకు అర్థమయిందని తెలిపారు. కశ్మీర్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని, కేవలం చర్చలు మాత్రమే పరిష్కారాన్ని చూపుతాయని ఆయన స్పష్టం చేశారు.

కశ్మీర్ సమస్య పరిష్కారానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని... చర్చల ద్వారానే ఆ ఆప్షన్స్ పై చర్చించగలుగుతామని ఇమ్రాన్ తెలిపారు. ఆ ఆప్షన్స్ ఏమిటో చెప్పాలని జర్నలిస్టులు ప్రశ్నించగా... రెండు, మూడు ఆప్షన్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిపై మరింత సమాచారం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని అన్నారు. అణ్వస్త్రాలను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశమే లేదని చెప్పారు. ఒకవేళ యుద్ధమే జరిగితే... ఊహించలేని పరిణామాలు ఉంటాయని అన్నారు.

త్వరలోనే భారత్ లో ఎన్నికలు జరగబోతున్నాయని... ఈ కారణం వల్లే పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా లేదని ఇమ్రాన్ తెలిపారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ఏ దేశ ప్రభుత్వమైనా వారి ఆర్మీ నుంచి సలహాలను స్వీకరించడం సహజమేనని అన్నారు. తన ప్రభుత్వం, పాకిస్థాన్ ఆర్మీ రెండూ ఒకే పేజ్ పై ఉన్నాయని... తన నిర్ణయాలకు ఆర్మీ మద్దతు ఉందని చెప్పారు.

More Telugu News