Telangana: కేటీఆర్, కవిత తమ జీవితాన్ని త్యాగం చేశారు.. దాని గురించి మాత్రం వీళ్లెవ్వరూ అడగరు!: కేసీఆర్ ఆగ్రహం

  • తెలంగాణ ఉద్యమంలోకి వీళ్లిద్దరూ దూకారు
  • దెబ్బలు తిని, జైలుకు కూడా పోయారు
  • ప్రజాఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలుపొందారు

అమెరికాలో తన కొడుకు కేటీఆర్, కుమార్తె కవిత మంచి జీతంతో హాయిగా బతికేవారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుకాగానే తమ సంతోషకరమైన జీవితాలను వదులుకుని వీళ్లిద్దరూ ఉద్యమంలోకి దూకారని అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేటీఆర్, కవితపై చాలాసార్లు దాడులు జరిగాయనీ, వాళ్లను జైలులో కూడా పెట్టారని గుర్తుచేశారు.

కేటీఆర్, కవిత ఎన్నికల్లో పోటీ చేసి దర్జాగా గెలిచారనీ, దొంగచాటుగా నామినేటెడ్ పదవులు పొందలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిందని ఆరోపణలు చేసే వ్యక్తులు, నేతలు వీటిపై మాట్లాడరని వ్యాఖ్యానించారు. ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ఈ మేరకు స్పందించారు. కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే పెద్దలు వారికి శాపంగా మారకూడదని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వంలో మొత్తం మంత్రిత్వశాఖలు తమ వద్దే అట్టిపెట్టుకోలేదనీ, ఆర్థిక శాఖ, హోంశాఖ వంటి కీలక బాధ్యతలు మిగతావారికి అప్పగించామని గుర్తుచేశారు. ఈసారి ఎన్నికల్లో తాము 95 నుంచి 107 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పోరాడిన వాళ్లే టీఆర్ఎస్ లో ఉన్నారనీ, అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపికలో పెద్దగా మార్పులు చేపట్టలేదనీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

More Telugu News