Telangana: మూఢనమ్మకంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదు!: సీఎం కేసీఆర్

  • బీజేపీ, కాంగ్రెస్ లు పనికిమాలిన పార్టీలు
  • జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తాం
  • ఫెడరల్ ఫ్రంట్ కింద దేశాన్ని ఏకం చేస్తాం

తెలంగాణలో ముఢనమ్మకాలతో తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. వీలైనంత త్వరగా తెలంగాణ ఎన్నికలు ముగించి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించబోతున్నానని ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, తన ఆలోచన విధానానికి తేడా ఉందని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్వూలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

దేశంలోని ప్రజలను ఫెడరల్ ఫ్రంట్ కింద ఏకం చేస్తామని గులాబీ బాస్ ప్రకటించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి బీ టీమ్ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించడంపై కేసీఆర్ మండిపడ్డారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అనే రెండు పనికిమాలిన పార్టీలు ఉన్నాయని దుయ్యబట్టారు. తెలంగాణకు వచ్చే మోదీ తాను కాంగ్రెస్ చెంచా అనీ, సోనియాగాంధీ తాను బీజేపీకి చెంచా అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతీ పార్టీతో కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు. తమ ఉద్యమంలో న్యాయాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా 42 పార్టీలు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ప్రకటించాయన్నారు.

More Telugu News