Telangana: తెలంగాణ ధనిక నేతల్లో కోమటిరెడ్డి టాప్.. నిరుపేద ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తి కేవలం రూ.15 మాత్రమే!

  • అఫిడవిట్లు పరిశీలించిన ఎలక్షన్ వాచ్ సంస్థ
  • 1,821 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నట్లు వెల్లడి
  • రెండో ధనిక నేతగా బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో టెన్షన్, టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన వివరాలను ఎలక్షన్ వాచ్ సంస్థ విడుదల చేసింది. మొత్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎలక్షన్ వాచ్ తెలిపింది.

వీరిలో నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అత్యంత ధనిక నేతగా ఉన్నారని వెల్లడించింది. ఆయనకు రూ.266.86 కోట్ల చరాస్తులు, రూ.47.45 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా ఆయనతో పాటు కుటుంబసభ్యుల పేరుతో ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.314 కోట్లకు పైమాటేనని చెప్పింది. ఇక బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్‌ కుమార్‌ రూ.182.66 కోట్ల స్థిర, చరాస్తులతో రెండో స్థానంలో, నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి రూ.161.29 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.

ఇక తెలంగాణలోని నిజామాబాద్ అర్బన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న బల్ల శ్రీనివాస్ రూ 15 ఆస్తితో అత్యంత నిరుపేదగా నిలిచినట్లు ఎలక్షన్ వాచ్ సంస్థ చెప్పింది. అలాగే కోరుట్ల స్వతంత్ర అభ్యర్థి జగిలం రమేష్‌ రూ.500, పెద్దపల్లి సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డి రూ.500ను ఆస్తులుగా చూపారని వెల్లడించింది. అలాగే తెలంగాణలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 8 శాతంగానే ఉందని పేర్కొంది.

More Telugu News