Rachakonda: వివాహితతో ప్రేమాయణం... ఆమె భర్తను చంపేందుకు ప్లాన్ వేసి, అతని చేతిలోనే దారుణ హత్య!

  • గత నెల 28న బీఎన్ రెడ్డి నగర్ లో దారుణ హత్య
  • కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు
  • వివాహేతర బంధమే కారణమన్న సీపీ మహేష్ భగవత్

డబ్బున్న కుటుంబంలో మంచి వ్యక్తికి భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న ఓ వివాహిత, అడ్డదారి తొక్కి మరొకరితో పెట్టుకున్న వివాహేతర బంధం, ఆ కుటుంబంలో చిచ్చుపెట్టింది. ప్రియుడి మోజులో పడి, అతని సాయంతో భర్తను హత్య చేయాలని ఆమె ప్లాన్ వేయగా, ఆ విషయం తెలుసుకున్న భర్త, ఇద్దరినీ చంపేయాలని ప్రయత్నించి, చివరకు ప్రియుడిని చంపించి జైలు పాలయ్యాడు.

గత నెల 28న హైదరాబాద్ శివారు బీఎన్ రెడ్డి నగర్ లో జరిగిన హత్య కేసు వెనకున్న మిస్టరీ ఇది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నాగర్‌ కర్నూలు జిల్లా, రచ్చలపల్లికి చెందిన గంగాపురం శ్రీధర్‌ రెడ్డిది ఉన్నత కుటుంబం. అతనికి 2009లో అశ్వినితో వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు. బిడ్డల చదువు నిమిత్తం శ్రీధర్‌ రెడ్డి దంపతులు కల్వకుర్తి వచ్చి అద్దె ఇంట్లో ఉంటుండగా, అదే ఇంట్లోని పై అంతస్తులో శ్రీనివాస్ గౌడ్‌ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో ఉండేవాడు.

మూడేళ్ల క్రితం శ్రీనివాస్ గౌడ్‌ తో శ్రీధర్‌ రెడ్డి భార్యకు పరిచయం ఏర్పడగా, అది వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న శ్రీధర్‌ రెడ్డి భార్యను మందలించాడు కూడా. ఈ గొడవలతో పిల్లల చదువు పాడవుతుందని హైదరాబాద్‌ లోని ఓ హాస్టల్లో చేర్చాడు. మరోపక్క శ్రీనివాస్ గౌడ్ తన భార్య, బిడ్డలను కల్వకుర్తిలోనే ఉంచి, హైదరాబాద్ లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించగా, అశ్విని, శ్రీనివాస్ గౌడ్ ల బంధం కొనసాగింది.

ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన అశ్విని, శ్రీధర్ స్వయంగా ఆత్మహత్య చేసుకునేలా చేయాలని ప్రణాళిక వేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను శ్రీధర్‌ రెడ్డికి పంపేలా చేసింది. ఈ విషయాన్ని తనవారి వద్ద, తన కింద పనిచేసేవారి వద్ద చెప్పుకుని బోరుమన్న శ్రీధర్, పోలీసులను ఆశ్రయించగా, శ్రీనివాస్ గౌడ్‌ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు కూడా.

జైలు నుంచి బయటకు వచ్చినా శ్రీనివాస్ తన పద్ధతి మార్చుకోలేదు. అతని సూచనతో తన భర్తపై అశ్వని వేధింపులు, గృహ హింస కేసు పెట్టింది. దీంతో వారిద్దరినీ హత్య చేయాలన్న ఆలోచనకు వచ్చిన శ్రీధర్‌ రెడ్డి, నల్లంగి శ్రీను, రట్లావత్‌ లాలూనాయక్‌, నూనె లక్ష్మణ్‌, కొడారపు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఠా ఏర్పాటు చేసుకుని రూ. 3 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నాడు. శ్రీనివాస్ గౌడ్ ఇంటిపైన వారిని అద్దెకు దింపాడు. గత నెల 28న శ్రీనివాస్‌ బైక్‌ పై వెళ్లడాన్ని చూసిన వారు, కారులో వెంటాడుతూ వెళ్లి, వేటకొడవళ్లతో నరికి చంపేశారు. ప్రియుడి వ్యామోహం అశ్వని కుటుంబంలో చిచ్చుపెట్టగా, పిల్లలు ఇప్పుడు అనాధలయ్యారు.

More Telugu News