Chandrababu: గద్దర్, కోదండరామ్ లపై చంద్రబాబు ప్రశంసలు

  • ఉద్యమకారుడైన గద్దర్ మాకు మద్దతు పలుకుతున్నారు
  • హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కోదండరామ్
  • తెలంగాణలో నేను సీఎంగా ఉండే అవకాశమే లేదు

ప్రజాగాయకుడు గద్దర్, టీజేఎస్ అధినేత కోదండరామ్ లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఉద్యమకారుడైన గద్దర్ కూడా తమకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కోదండరామ్ అని ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తామంతా ఒక్కటయ్యామని చెప్పారు.

టీడీపీ హయాంలోనే హైదరాబాదు అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్ర ఆదాయంలో 64 శాతం హైదరాబాదు నుంచే వస్తోందని తెలిపారు. గాంధీ ఆసుపత్రిని అధునాతన ఆసుపత్రిగా మార్చిన ఘనత తమదేనని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. హైదరాబాద్ రాంనగర్ లో రోడ్ షోలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ మేరకు వ్యాఖ్యానించారు.

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. మాయ మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని... ఆ ప్రయత్నాలు ఫలించవని కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో తాను ముఖ్యమంత్రిగా ఉండే అవకాశమే లేదని ఆయన మరోసారి చెప్పారు. మహాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అభ్యర్థే సీఎం అవుతారని తెలిపారు.  

More Telugu News