Andhra Pradesh: ఆంధ్రాలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలచేసిన మంత్రి గంటా!

  • డిసెంబర్ 7తో ముగియనున్న దరఖాస్తు గడువు
  • మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ పరీక్షల నిర్వహణ
  • 91 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలకు ఈ నెల 7లోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన పదో తరగతి పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ను విడుదల చేశారు. 2019 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని గంటా తెలిపారు. పరీక్షల కోసం ఇప్పటివరకూ 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

పరీక్షల నిర్వహణ కోసం 2,833 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. వీటిలో 91 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు.  ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతను పెంచడంతో పాటు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పరీక్షల నిర్వహణ పూర్తయ్యాక నెల రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపియింగ్ వంటి ఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

More Telugu News