India: కిలో రూ.1.40 కూడా పలకని ఉల్లి.. కడుపుమంటతో ప్రధాని మోదీకి మనీఆర్డర్ చేసిన రైతు!

  • మహారాష్ట్రలోని నాసిక్ లో ఘటన
  • 750 కేజీల పంటకు రూ.1,064 ఇచ్చిన దళారి
  • మనస్తాపంతో దాన్ని మోదీకి పంపిన రైతు

పంట వేయాలంటే వానలు లేక, ఒకవేళ వర్షాలు పడ్డా నకిలీ విత్తనాలతో రైతులు దేశంలో అల్లాడిపోతున్నారు. చివరికి అష్టకష్టాలు పడి పంటను పండించినా, దళారులు తక్కువ ధరకు దోచుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఉల్లి రైతు సంజయ్ సాథేకు ఇదే పరిస్థితి ఎదురయింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన సంజయ్ ఈసారి 750 కేజీల ఉల్లి పంటను పండించాడు.

దాన్ని మార్కెట్ కు తీసుకెళ్లగా దళారుల దెబ్బకు కేజీ ఉల్లికి కేవలం రూ.1.40 చొప్పున రూ.1,064 మాత్రమే వచ్చాయి. దీంతో తీవ్ర ఆవేదనకు లోనయిన సంజయ్.. ఈ మొత్తాన్ని ప్రధాని మోదీకి మనీ ఆర్డర్ ద్వారా పంపాడు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరసనగానే తాను ఈ పనిచేశానని సంజయ్ తెలిపాడు. రూ.1,064ను ప్రధాని విపత్తు సహాయక నిధికి పంపినట్లు వెల్లడించాడు. ఈ నగదును పంపేందుకు మనీ ఆర్డర్ కోసం మరో రూ.54 ఖర్చు అయ్యాయని పేర్కొన్నారు.

వ్యవసాయంలో విప్లవాత్మక పద్ధతులు పాటించినందుకు సంజయ్ ను మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గతంలో సత్కరించాయి. 2010లో భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన సంజయ్.. అధిక దిగుబడి కోసం తాను అవలంబించిన విధానాలను ఆయనకు వివరించారు. అలాంటి వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురుకావడం గమనార్హం.

More Telugu News