Andhra Pradesh: రూ.5,700 కోట్ల మోసం కేసు.. నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న సుజనా చౌదరి!

  • ఈడీ విచారణపై ఢిల్లీ హైకోర్టుకెళ్లిన సుజన
  • పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం
  • విచారణకు హాజరుకావాలని ఆదేశం

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి మరికాసేపట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు విచారణకు హాజరుకానున్నారు. బ్యాంకులను రూ.5,700 కోట్ల మేర మోసం చేసిన కేసులో విచారణకు హాజరుకావాలని సుజనా చౌదరికి ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు జారీచేశారు. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

కేంద్ర ప్రభుత్వం తనను రాజకీయంగా వేధిస్తోందనీ, ఈడీ, ఐటీ శాఖలను ఇందుకు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. సుజనా చౌదరి న్యాయవాది చేసిన వాదనలను ఈడీ ప్రతినిధి ఖండించారు. ఆయన బ్యాంకులను మోసం చేశారనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు.

దాదాపు 120 డొల్ల(షెల్) కంపెనీలతో ఆయన రూ.5,700 కోట్లను కొల్లగొట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సుజనా చౌదరి పిటిషన్ ను కొట్టివేశారు. డిసెంబర్ 3న(నేడు) ఈడీ అధికారుల ముందు హాజరుకావాలని ఆదేశించారు. కాగా, సుజనా చౌదరిని నిర్బంధించే చర్యలేవీ తీసుకోరాదని న్యాయమూర్తి ఈడీ అధికారులకు స్పష్టం చేశారు.

More Telugu News