Jet Airways: పైలట్లకు ఒక్కసారిగా 'మాయ'రోగం... పలు జెట్ విమానాల క్యాన్సిల్!

  • ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో జెట్ ఎయిర్ వేస్
  • మూకుమ్మడి సిక్ లీవ్ తీసుకున్న పైలట్లు
  • 14 విమానాల రద్దుతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగి, నష్టాల నుంచి తేరుకునే మార్గం కోసం వెతుక్కుంటున్న జెట్‌ ఎయిర్‌ వేస్‌ కు మరో ఇబ్బంది వచ్చి పడింది. సెప్టెంబర్ నెలలో సగం వేతనం చెల్లించిన సంస్థ, ఆపై మిగతా మొత్తాన్ని, అక్టోబర్, నవంబర్ నెలల వేతనాన్ని పెండింగ్ లో ఉంచేసరికి, పలువురు పైలట్లు తమకు అనారోగ్యంగా ఉందని చెబుతూ మూకుమ్మడిగా సిక్ లీవు పెట్టడంతో 14 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

 దీంతో ఆ విమానాల సర్వీసుల్లో ప్రయాణించాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్దీ ఎయిర్ పోర్టుల్లో ఉండిపోయి జెట్ ఎయిర్ వేస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పైలట్లు సహకరించని కారణంగానే విమానాలను రద్దు చేశామని, దీని కారణంగా దాదాపు 100కు పైగా సర్వీసులు నిలిచిపోయాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సర్వీసులు రద్దు కాబడిన విషయాన్ని ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ల రూపంలో వెల్లడించామని, సాధ్యమైనంత మంది ప్రయాణికులను ఇతర విమానాల్లో గమ్య స్థానాలకు చేర్చామని, మిగిలిన వారికి పరిహారం అందించనున్నామని పేర్కొంది.

More Telugu News