MIM: పాతబస్తీలోని అన్ని స్థానాల్లోనూ విజయం మాదే!: అక్బరుద్దీన్‌ ఒవైసీ ధీమా

  • ముస్లింల అభ్యున్నతికి కాంగ్రెస్‌ చేసింది ఏమీ లేదు
  • మైనార్టీల గళాన్ని వినిపించేది అసదుద్దీన్‌ మాత్రమే
  • సోనియా, రాహుల్‌, మోదీ నియోకవర్గాలపైనా దృష్టి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీలోని అన్ని స్థానాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు విజయఢంకా మోగించడం ఖాయమని మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ జోస్యం చెప్పారు. నాంపల్లి నియోజకవర్గంలో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తున్నా ముస్లింలు మాత్రం ఇప్పటికీ దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీలకు చేసిన మేలేమి లేదన్నారు. ప్రజాధనంతో నిర్మించిన రహదారులు, విమానాశ్రయాలు, ఇతర సంస్థలకు తమ పేర్లు మాత్రం పెట్టుకుందని విమర్శించారు.

నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ అస్తవ్యస్తం చేశారని ధ్వజమెత్తారు. మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కడైనా గళం విప్పేది ఎంఐఎం అధినేత అసుదుద్దీన్‌ ఒవైసీ మాత్రమేనని గుర్తుచేశారు. మజ్లిస్‌ ఎవరి వద్దా తలదించుకోదని, ఎవరైనా తమ వద్ద తలదించుకోవాల్సిందేనని పునరుద్ఘాటించారు.  దేశవ్యాప్తంగా 4,200 మంది శాసన సభ్యులుండగా, తమ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అయినా మజ్లిస్‌ గురించి రాహుల్‌, మోదీ మాట్లాడేలా చేయగలుగుతున్నామన్నారు.

తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ సొంత నియోజక వర్గాలైన వారణాసి, అమేథి, రాయబరేలీలపై దృష్టిసారిస్తామని చెప్పారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వీరి ఓటమికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తామని తెలిపారు.

More Telugu News