Pawan Kalyan: ఈడు సినిమా వోడు.. రాజకీయాలేం తెలుసు అనుకోవద్దు: పవన్ కల్యాణ్

  • లోకేశ్ అవినీతి పెచ్చు మీరింది
  • నాకు రాజకీయాలు తెలియవనుకోవద్దు
  • చంద్రబాబుది ధృతరాష్ట్ర పాలన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. అనంతపురంలో నిర్వహించిన కవాతులో పవన్ మాట్లాడుతూ.. మంత్రి లోకేశ్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక ర్యాంపులు, మట్టి తరలింపులో లోకేశ్ పెద్ద ఎత్తున దోచుకుంటున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.1000 నుంచి రూ. 3,500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

చంద్రబాబుకు వయసు అయిపోయిందని, కుమారుడి భవిష్యత్తును నిలబెట్టేందుకు రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారని అన్నారు. పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలవలేని వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండడం విడ్డూరమన్నారు. కాపాడాలంటూ తనను వందసార్లు కోరిన చంద్రబాబు కావాలో, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పారిపోయిన జగన్ కావాలో, ఓటు వేయకున్నా అండగా నిలిచే పవన్ కావాలో మీరే తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.  

తనపై అనవసరంగా నోరు పారేసుకుంటున్న వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు ఈ సందర్భంగా పవన్ వార్నింగ్ ఇచ్చారు. తనపైనా, జనసేన పైన నోరు పారేసుకుంటున్న బొత్స దానిని అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. లేదంటే తాను విజయనగరం వచ్చినప్పుడు ఆయన సంగతి చూసుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు. తాను నటుడినని, తనకు రాజకీయాలు తెలియవని అనుకోవద్దన్నారు. 2019లో సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతున్నాయని, అప్పుడు సరికొత్త రాజకీయాలు చేసి చూపిస్తానని పేర్కొన్నారు. నేతలను తన పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు పవన్ తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలను వదిలిపెట్టాలని సూచించారు.  

More Telugu News