Chinmayi: ఆ 'బిరుదు' నకిలీది... రాధారవి బండారాన్ని బయటపెట్టిన గాయని చిన్మయి!

  • మలేషియా ప్రభుత్వం 'డటోక్' బిరుదు ఇవ్వలేదు
  • అసత్యాలు చెప్పి అభిమానులను వంచిస్తున్నారు
  • మలేషియా ప్రభుత్వం నుంచి సమాధానం పొందిన చిన్మయి

దక్షిణాదిన 'మీటూ' ఉద్యమం మరింతగా విస్తరించడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ, ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన గాయని చిన్మయి శ్రీపాద, ఇప్పుడు సీనియర్‌ నటుడు, దక్షిణ భారత బుల్లి తెర, సినీ డబ్బింగ్‌ కళాకారుల సంఘం అధ్యక్షుడు రాధారవితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతూ, ఆయన బండారాన్ని బయటపెట్టింది.

చిన్మయిని డబ్బింగ్‌ కళాకారుల సంఘం నుంచి రాధారవి తొలగించగా, 'మీటూ' ఆరోపణ కారణంగానే ఆయన తనను తొలగించారన్న చిన్మయి, తన సభ్యత్వాన్ని రద్దు చేయడం ఆయనకు సాధ్యం కాదని, తాను శాశ్వత సభ్యురాలినని చెప్పింది. ఇదే సమయంలో రాధారవికి మరో షాకిచ్చిన ఆమె, మలేషియా ప్రభుత్వం 'డటోక్‌' అనే ఆ దేశ ప్రతిష్టాత్మకమైన బిరుదును ఇచ్చిందని అసత్యాలు చెప్పుకుంటున్నారని ఆరోపిస్తూ సాక్ష్యాలను చూపించారు.

తాజాగా రాధారవికి 'డటోక్' బిరుదు ప్రధానంపై మలేషియా ప్రభుత్వానికి లేఖ రాసి, సమాధానం తెప్పించుకున్న ఆమె, తన ట్విట్టర్ ఖాతాలో రాధారవికి ఈ బిరుదు రాలేదని తేల్చి చెప్పారు. ఇండియాలో ఒక్క షారూక్‌ ఖాన్‌ కు మినహా మరెవరికీ ఆ బిరుదును అందించలేదని మలేషియా ప్రభుత్వం స్పష్టం చేసినట్టు చెప్పారు. చిన్మయి పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా, ఇంకా రాధారవి స్పందించలేదు.

More Telugu News