Congress: పోలీసుల సోదాలకు నిరసనగా.. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించిన రేవంత్ రెడ్డి!

  • కాంగ్రెస్ నేతలపై ఐటీ సోదాలు
  • పలువురు నేతలతో కలసి రోడ్డుపై బైఠాయింపు
  • అదనపు బలగాల తరలింపు

తన అనుచరుల ఇళ్లలోకి వారంట్లు లేకుండా ప్రవేశించిన పోలీసులు, దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, శనివారం అర్ధరాత్రి నడిరోడ్డుపై నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతల ఇళ్లపై పోలీసుల దాడులకు నిరసనగా, పలువురు నేతలతో కలసి ఆయన రోడ్డుపై బైఠాయించారు.

కొడంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు యూసుఫ్‌, ఆయన అన్న ముస్తాక్ లపై శనివారం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. యూసుఫ్‌, రేవంత్ ప్రధాన అనుచరుడే. ఇదే సమయంలో బొంరాస్ పేట్ పోలీసులు రేవంత్ మరో అనుచరుడు రామ్ చందర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేసి, ఏమీ లభించలేదని చెప్పి వెళ్లిపోయారు.

 సెర్చ్‌ వారెంట్‌ చూపకుండానే ఇళ్లల్లోకి వచ్చేసిన పోలీసులు, మహిళలతో దురుసుగా ప్రవర్తించారని ఈ సందర్భంగా రేవంత్ నిప్పులు చెరిగారు. సోదాలు జరిపినా ఏమీ లభించలేదని చెబుతున్న అధికారులు, అదే విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసివ్వాలంటూ పట్టుపట్టారు. తనపై, తన అనుచరులపై పోలీసులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

తనపై భౌతిక దాడులకు దిగే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను ఏ పరిస్థితినైనా ఎదిరిస్తానని చెప్పారు. కొడంగల్ తో పాటు బొంరాస్ పేట్ లో కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు ధర్మాకు దిగడంతో పోలీసులు అప్రమత్తమై, అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు.

More Telugu News