Andhra Pradesh: ఆంధ్రాలో సీబీఐ వర్సెస్ ఏసీబీ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్!

  • సమ్మతి ఉత్తర్వులను రద్దుచేసిన ఏపీ ప్రభుత్వం
  • మచిలీపట్నంలో కేంద్ర ఉద్యోగిపై ఏసీబీ దాడి
  • సీబీఐ, ఏసీబీల మధ్య మాటల యుద్ధం

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రాష్ట్రంలో కేసుల్ని విచారించేందుకు వీలుగా ఇచ్చే సమ్మతి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాజకీయ దాడులకు వాడుకుంటోందని ఆరోపిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా మచిలీపట్నంలో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఏపీ అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంది. దీంతో ఈ వ్యవహారంపై సీబీఐ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అవినీతి వ్యవహారంపై సీబీఐ విచారించాల్సి ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం సమాచారం లీక్ చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారని వ్యాఖ్యానించారు. పరస్పర సహకారం లేకపోతే అవినీతిని అరికట్టడం కష్టమన్నారు.

అయితే సీబీఐ ఉన్నతాధికారుల వాదనను ఏపీ ఏసీబీ అధికారులు ఖండించారు. మచిలీపట్నంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అవినీతిపై తమకు పక్కా సమాచారం అందిందనీ, దాని ఆధారంగానే దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు. పక్కా ప్లాన్ తో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టమని తేల్చిచెప్పారు. మరోవైపు కేంద్రానికి చెందిన సీబీఐ, రాష్ట్రానికి చెందిన ఏసీబీ మధ్య తాము చిక్కుకుంటామన్న భయంతో కేంద్ర ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. సోమవారం విజయవాడలో సమావేశం కావాలని ఎక్సైజ్ అధికారుల సంఘం నేతలు నిర్ణయించారు. ఈ వ్యవహారంపై చర్చించి ఎక్సైజ్ కమీషనర్ తోనూ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పోరులో తమను బలిపశువులను చేసే కుట్ర జరుగుతోందని నేతలు వ్యాఖ్యానించారు.

More Telugu News