Telangana: కేసీఆర్ బ్లాక్ మనీ మలేసియా వెళుతోంది.. ‘సత్యం’ రామలింగరాజు కుమారుడే ఇందుకు సూత్రధారి!: మధుయాష్కీ

  • కేటీఆర్ ఆస్తులు పదేళ్లలో రూ.41 కోట్లకు పెరిగాయి
  • కవితకు బెంగళూరులో విల్లాలు ఉన్నాయి
  • దమ్ముంటే కేటీఆర్ నాతో చర్చకు రావాలి

చెల్లి కవిత, బావ హరీశ్ రావుతో కలిసి మంత్రి కేటీఆర్ తెలంగాణను దోచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ఆరోపించారు. కేసీఆర్ ఏక్ నంబరీ అయితే కేటీఆర్ దస్ నంబరీ అని విమర్శించారు. ఆంధ్రా పారిశ్రామికవేత్తలు, సినీ నిర్మాతలు, ఏపీ కాంట్రాక్టర్ల నుంచి కల్వకుంట్ల ఫ్యామిలి డబ్బులు వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. ఎలాంటి టెండర్లు లేకుండానే రూ.1,500 కోట్ల విలువైన మిషన్ భగీరథ పనుల్ని కేసీఆర్ సన్నిహితులకు అప్పగించారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మధుయాష్కీ మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తన అక్రమ సంపాదనను సత్యం రామలింగరాజు కుమారుడు సత్యం తేజ్ రాజ్ ద్వారా మలేసియాకు తరలిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ బ్లాక్ వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారని తెలిపారు. అందువల్లే సత్యం తేజ్ రాజ్ ను తీసుకుని కేటీఆర్ అమెరికా, సింగపూర్ మలేసియా టూర్లకు వెళుతున్నారని విమర్శించారు. ఇందుకు సాక్ష్యంగా మలేసియాలో వీరిద్దరూ దిగిన ఫొటోను మధుయాష్కీ విడుదల చేశారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాననీ, వీటిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు ఆత్మార్పణం చేసుకుంటే, కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తులు పెంచుకుంటోందని విమర్శించారు. 2001లో కేటీఆర్‌ ఆస్తి రూ.1.13 కోట్లు అని.. 2014 నాటికి రూ.7.98 కోట్లకు, 2018 కల్లా ఈ మొత్తం రూ.41 కోట్లకు చేరుకుందన్నారు. ఈ ఆరోపణలపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని మంత్రి కేటీఆర్ కు సవాలు విసిరారు. కేటీఆర్ కు బెంగళూరులో ఉన్న బినామీల గుట్టును త్వరలోనే బయటపెడతానని మధుయాష్కీ చెప్పారు. బెంగళూరులో కవితకు విల్లాలు ఉన్నాయని.. ఆమె కొనుగోలు చేసిన విల్లాల ఫొటోలను రేపు బయటపెడతానని ఆయన చెప్పారు.

More Telugu News