KTR: చంద్రబాబు అంతు చూస్తాం.. ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెడతాం!: కేటీఆర్

  • పుట్టలో వేలు పెడితే చీమయినా కుడుతుంది
  • తెలంగాణలో వేలుపెట్టిన బాబును ఏం చేయాలి?
  • కూకట్ పల్లి కాపుల సభలో మంత్రి కేటీఆర్ ఫైర్

తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అనవసరంగా తెలంగాణలో జోక్యం చేసుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పుట్టలో వేలు పెడితే చీమ అయినా కుడుతుందని తెలిపారు. అలాంటిది తెలంగాణలో వేలు పెట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి చూస్తామని వ్యాఖ్యానించారు. అవసరమైతే ఆంధ్రాలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలు పెట్టడానికి వెనుకాడబోరని స్పష్టం చేశారు. కూకట్ పల్లిలో కాపు సామాజికవర్గం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడారు.

జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ యత్నిస్తున్నారని మంత్రి తెలిపారు. చంద్రబాబు అంతు చూసేందుకు, ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కు సమస్యలు సృష్టించేందుకు తాము ఎన్నడూ ప్రయత్నించలేదని వ్యాఖ్యానించారు. ఓడిపోతారని తెలిసే మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసినిని అభ్యర్థిగా నిలిపారని విమర్శించారు. తాము ప్రశాతంగా ఉండాలనుకుంటూ ఉంటే చంద్రబాబు తమతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపన సమయంలో కేసీఆర్ రూ.100 కోట్లు తీసుకొచ్చారని, అయితే మోదీ చెంబు నిండా నీళ్లు, మట్టి తీసుకురావడంతో మౌనంగా వెనుదిరిగారని పేర్కొన్నారు.

More Telugu News