వంటగ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధర

01-12-2018 Sat 07:28
  • జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.14.30 పెరుగుదల
  • తాజాగా రూ. 6.52 తగ్గింపు
  • రాయితీ లేని సిలిండర్‌పై రూ.133 తగ్గింపు
జూన్ నుంచి ప్రతి నెలా పెరుగుతూ వస్తున్న గ్యాస్ ధరలకు అడ్డుకట్ట పడింది.  రాయితీ సిలిండర్‌పై ఏకంగా రూ. 6.52 తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు శుక్రవారం అర్ధ రాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం 14.2 కేజీల రాయితీ  సిలిండర్ ధర ఢిల్లీలో రూ.507.42గా ఉంది. ధర తగ్గింపుతో ఇప్పుడు రూ. 500.90కి దిగి వచ్చింది.

సబ్సిడీయేతర సిలిండర్‌ ధరను ఏకంగా రూ.133 తగ్గిస్తున్నట్టు ఐవోసీఎల్ తెలిపింది. ప్రస్తుతం సబ్సిడీయేతర సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 942.50గా ఉండగా, ధర తగ్గింపుతో రూ. 809.50కు చేరుకుంది. ఈ నెల నుంచి రాయితీ గ్యాస్ వినియోగదారులకు రూ. 308.60 బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. జూన్ నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. సిలిండర్‌పై మొత్తం  రూ. 14.30 పెరిగింది. ఇప్పుడు రూ. 6.52ను ఐవోసీఎల్ తగ్గించింది. రూపాయి విలువ బలపడడంతోపాటు అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడమే ధరల తగ్గింపునకు కారణమని ఐవోసీఎల్ పేర్కొంది.