Telangana: తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్.. అజారుద్దీన్ కు కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్!

  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం
  • వినోద్ కుమార్, జాఫర్ లకు ఉపాధ్యక్ష పదవులు
  • నేడు ప్రకటన విడుదల చేసిని ఏఐసీసీ

తెలంగాణలో ఎన్నికల వేళ పార్టీలో చేరిన నేతలకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవులను అప్పగిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాధ్యతలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్పగించారు. తాజాగా పార్లమెంటు మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ  నేత మొహమ్మద్ అజారుద్దీన్ కు హస్తం పార్టీ కీలక పదవి అప్పగించింది. ఆయనను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించింది.

ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పాటు బీఎం వినోద్ కుమార్, జాఫర్ జావేద్ లను ఉపాధ్యక్షులుగా నియమించింది. డిసెంబర్ 7న జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ, సీపీఐ, టీజేఎస్, నేతలతో కలిసి మహాకూటమిని ఏర్పాటుచేసి పోటీ చేస్తోంది.

అజారుద్దీన్ 2009, ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించారు. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి అజారుద్దీన్ ను రంగంలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం.

More Telugu News