coal scam: బొగ్గు కుంభకోణం కేసు.. ఐదుగురిని దోషులుగా తేల్చిన ఢిల్లీ కోర్టు

  • 2006-2009 మధ్య గనుల కేటాయింపు
  • బొగ్గు కార్యదర్శి గుప్తాను దోషిగా తేల్చిన న్యాయస్థానం
  • డిసెంబర్ 3న శిక్షలు ఖరారు చేయనున్న కోర్టు

యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణంపై ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంలో అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్ సీ గుప్తాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది. పశ్చిమబెంగాల్ లోని 40 గనులను వేర్వేరు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని కోర్టు అభిప్రాయపడింది. గుప్తాతో పాటు వికాస్ పవర్ లిమిటెడ్ సంస్థపై నేరపూరిత కుట్రతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు రుజువు అయ్యాయని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి శిక్షలను డిసెంబర్ 3న ఖరారు చేస్తామని కోర్టు పేర్కొంది.

2006-2009 మధ్య కాలంలో బొగ్గు గనుల శాఖ.. బెంగాల్, బిహార్, జార్ఖండ్ లోని బొగ్గు గనుల లైసెన్సులను కారు చౌకగా టాటా గ్రూప్ సంస్థలు, జిందాల స్టీల్ పవర్ లిమిటెడ్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్, అనిల్ అగర్వాల్ గ్రూప్ సంస్థలు, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్, జైస్వాల్ నెకో, అభిజిత్ గ్రూప్, ఆదిత్యా, బిర్లా గ్రూప్ కంపెనీలు, ఎస్సార్ గ్రూప్ ప్రైవేట్ వెంచర్స్, అదానీ గ్రూప్, ఆర్సిలార్ మిట్టల్ ఇండియా, లాంకో గ్రూప్‌ కు కట్టబెట్టింది.

ఈ విషయమై అధ్యయనం చేసిన కాగ్.. కేంద్రం నిర్ణయం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.1,86,000 కోట్ల నష్టం వాటిల్లిందని బాంబు పేల్చింది. ఈ వ్యవహారంలో కేసును నమోదు చేసిన సీబీఐ జార్ఖండ్ మాజీ సీఎం మధుకొడాతో పాటు పలువురు నేతలను ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజాగా బెంగాల్ లో గనుల కేటాయింపులో గుప్తా నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు నిర్ధారించింది.

More Telugu News