Arunachal Pradesh: గర్భిణికి పురిటి నొప్పులు.. ఏకంగా హెలికాప్టర్ లో ఆసుపత్రికి పంపి కాపాడిన గవర్నర్!

  • అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా పెద్దమనసు
  • సిజేరియన్ ఆపరేషన్ కోసం హెలికాప్టర్ లో తరలింపు
  • పండంటి చిన్నారికి జన్మనిచ్చిన యువతి

ప్రభుత్వ పెద్దలు, అధికారులు అంటేనే అధికార దర్పానికి ప్రతీకలుగా ఉంటారని భావిస్తాం. కానీ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే వైద్యం కోసం ఏకంగా హెలికాప్టర్ ను పంపించి తన పెద్ద మనసును చాటుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తవాంగ్ పట్టణానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఓ యువతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించారు. బాధితురాలిని రోడ్డు మార్గాన 200 కి.మీ దూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 15 గంటలు పడుతుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్ మిశ్రా.. తన హెలికాప్టర్ లో గర్భిణితో పాటు ఆమె భర్తను ఇటానగర్ లోని ఆసుపత్రికి పంపారు.

అక్కడితో ఆగిపోకుండా ఇటానగర్ లో హెలికాప్టర్ దిగగానే ఆసుపత్రికి తీసుకెళ్లేలా ఓ అంబులెన్సును, గైనకాలజిస్టును అందుబాబులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆ యువతి చివరికి పండంటి చిన్నారికి జన్మనిచ్చింది. కాగా, గవర్నర్ మిశ్రా తీసుకున్న చొరవపై అన్నివర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

More Telugu News