Andhra Pradesh: నేను సైబరాబాద్ ను కట్టా.. కానీ కేసీఆర్ ‘ఫాం హౌస్’ తప్ప ఇంకేమీ కట్టలేకపోయాడు!: చంద్రబాబు

  • విజన్-2020ని నేనే రూపొందించా
  • సలహాల కోసం కలాం నా దగ్గరకు వచ్చారు
  • అమరావతి కలెక్టర్ల సదస్సులో బాబు

దేశం బాగుంటే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేవలం ఏపీకే పరిమితం కాకుండా దేశం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. డీఎల్ఎఫ్, రహేజా, ఎల్ అండ్ టీ, మైండ్ ట్రీ వంటి సంస్థలను ఆహ్వానించి హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని తెలిపారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.

ఇప్పటి దుబాయ్ పాలకుడు, అప్పటి యువరాజు సైతం సైబరాబాద్ ప్రాంతంలో పెట్టుబడి పెట్టారని తెలిపారు. గచ్చిబౌలిలో జాతీయ క్రీడల నిర్వహణను సవాలుగా తీసుకుని మౌలిక వసతులను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ ను కట్టలేదని చెప్పడంపై స్పందిస్తూ..‘నేను హైదరాబాద్ ను కట్టలేదు. దాన్ని కులీకుతుబ్ షానే కట్టారని కేసీఆర్ చెప్పా. సైబరాబాద్ తో పాటు నగరంలో నేను చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించా. కేసీఆర్ గత నాలుగున్నరేళ్లలో ఒక్క ఫాంహౌస్ ను తప్ప ఇక దేన్నీ కట్టలేదు’ అని విమర్శించారు. ఓ పనిని ప్రారంభించడం ఎంత ముఖ్యమో, పూర్తిచేయడం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించారు.

ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ సాంకేతికతను వాడుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచానికి ఓ నమూనాగా చూపుతామన్నారు. వయా డక్ట్ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రతి విభాగం ఓ విజన్ తో పనిచేయడమే దీని లక్ష్యమన్నారు. విజన్ -2020 డాక్యుమెంట్ ను తయారుచేయడానికి దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన వద్దకు వచ్చారని గుర్తుచేసుకున్నారు. తాను ప్రకటించిన విజన్-2020పై పలు అంశాలను కలాం అడిగి తెలుసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News