Andhra Pradesh: ‘చూస్తుంటే దేశ రాజధానినే హైదరాబాద్ కు పట్టుకెళ్లేలా ఉన్నావ్’ అంటూ ప్రధాని వాజ్ పేయి కితాబిచ్చారు!: చంద్రబాబు

  • ఔటర్ రింగ్ రోడ్డు అన్నది ఓ అద్భుతం
  • పొలిటికల్ గవర్నన్స్ దిశగా సాగుతున్నాం
  • అమరావతి కలెక్టర్ల సదస్సులో సీఎం వెల్లడి

హైదరాబాద్ లో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రపంచంలోనే ఓ అద్భుతమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో 164 కిలోమీటర్ల పొడవుతో 8 వరుసల రహదారిని నిర్మించామని చెప్పుకొచ్చారు. చాలామంది ఇది ఎలా సాధ్యం? అని అప్పట్లో ప్రశ్నించారనీ, తాను మాత్రం దాన్ని చేసి చూపానని వ్యాఖ్యానించారు. అమరావతి ప్రజావేదికలో భాగంగా ఈరోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు.

దేశంలోనే ప్రైవేటు రంగంలో తొలి విద్యుత్ ప్రాజెక్టును జీవీకే కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోనే ప్రారంభించిందని చంద్రబాబు గుర్తుచేశారు. విద్యుత్ రంగంలో టీడీపీ ప్రభుత్వం అప్పట్లోనే విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందన్నారు. పరిపాలన, రాజకీయం రెండింటిని సమన్వయం చేసుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలు తనపై ఎంతగానో ప్రభావం చూపాయనీ, అందుకే పొలిటికల్ గవర్నెన్స్ దిశగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

ఇన్సూరెన్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పట్లో భూమిని ఇచ్చేందుకు ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అప్పటి అథారిటీ చైర్మన్ రంగాచారి తన దగ్గరకు రాగానే భవన నిర్మాణం కోసం భూమిని కేటాయించామని వెల్లడించారు. అయితే ఇందుకోసం కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉండటంతో అప్పటి ప్రధాని వాజ్ పేయిని కలిశానని పేర్కొన్నారు. వెంటనే వాజ్ పేయి స్పందిస్తూ..‘చంద్రబాబు.. నిన్ను చూస్తుంటే దేశ రాజధానినే హైదరాబాద్ కు తీసుకెళ్లేలా ఉన్నావ్’ అని ప్రశంసించారన్నారు. చివరికి తన చొరవతో హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రారంభం అయిందని వ్యాఖ్యానించారు.

More Telugu News