Andhra Pradesh: కాకినాడలో ‘వంచనపై గర్జన’ సభ.. నలుపురంగు దుస్తుల్లో హాజరుకానున్న వైసీపీ శ్రేణులు!

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా
  • ఇప్పటికే నాలుగు సభలు నిర్వహించిన వైసీపీ
  • హాజరుకానున్న ప్రతిపక్ష నేత జగన్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రతిపక్ష వైసీపీ ముమ్మరం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా ప్రతిపక్ష వైసీపీ నేడు నిర్వహించనున్న ‘వంచనపై గర్జన’ సభకు కాకినాడ సిద్ధమైంది. ఇక్కడి బాలాజీ చెరువు సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు సభ కోసం ఏర్పాట్లు పూర్తిచేశాయి. మరికాసేపట్లో సభా స్థలి వద్దకు చేరుకోనున్న జగన్ ‘వంచనపై గర్జన’ సభ వేదికగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టనున్నారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ అధినేతతో పాటు రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు కోఆర్డినేటర్లు పాల్గొననున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నలుపురంగు దుస్తులతో వైసీపీ నేతలు హాజరు కానున్నారు. ప్రత్యేకహోదాపై ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, నెల్లూరులో వైసీపీ ‘వంచనపై గర్జన’ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, కాకినాడ 'వంచనపై గర్జన' సభకు అన్నిపక్షాలు కలిసిరావాలని వైసీపీ పిలుపునిచ్చింది.

More Telugu News