fisher men: పాక్ కోస్ట్ గార్డు అధికారుల అదుపులో ఏపీ జాలర్లు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు!

  • పాక్ అదుపులో ఏపీకి చెందిన 28 మంది జాలర్లు
  • శ్రీకాకుళం, విజయనగరం, తూ.గోదావరి జిల్లాల జాలర్లు 
  • జాలర్లు గుజరాత్ వద్ద సరిహద్దు దాటారని ఆరోపణ 

గుజరాత్ వద్ద సరిహద్దు దాటారని ఆరోపిస్తూ చేపల వేటకు వెళ్లిన 28 మంది ఏపీ జాలర్లను పాకిస్థాన్ కోస్ట్ గార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 20 మందిని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల వాసులుగా గుర్తించారు. నలుగురు తూర్పుగోదావరి, మరో నలుగురు విజయనగరం జిల్లాకు చెందిన జాలర్లని తెలుస్తోంది. మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్బంధించిన జాలర్లను కరాచీ పంపినట్టు సమాచారం.

కాగా, ఈ సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు మంత్రి కళా వెంకట్రావు తెలియజేశారు. ఏపీ భవన్ అధికారులతో ఈ మేరకు చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం. అదుపులో ఉన్న జాలర్లను తిరిగి ఇక్కడికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని, జాలర్లకు అన్ని విధాలా అండగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాలర్ల కుటుంబాలు ఆందోళన చెందవద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

జాలర్లు వెనక్కి వచ్చేలా చర్యలు చేపడుతున్నాం

భారత్ అధికారులు, పాక్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, జాలర్లు వెనక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కళా వెంకట్రావు చెప్పారు.వారి విడుదలకు ప్రభుత్వ పరంగా అన్ని చర్చలు తీసుకుంటున్నామని అన్నారు.

స్పందించిన భారత రాయబార కార్యాలయం 


  ఈ విషయమై ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ స్పందించింది. ఏపీ ప్రభుత్వ ఆందోళనను పాక్ విదేశాంగ శాఖ దృష్టికి హై కమిషన్ తీసుకెళ్లింది. పాక్ విదేశాంగ శాఖ అధికారులతో భారత రాయబార కార్యాలయ అధికారి గౌరవ్ అహ్లూవాలియా సంప్రదింపులు జరిపారు. ఏపీ ప్రభుత్వానికి పూర్తి తోడ్పాటు అందిస్తామని రాయబార కార్యాలయ అధికారులు ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ కు హామీ ఇచ్చినట్టు సమాచారం.

More Telugu News