Chandrababu: ఎన్నిసార్లు కోరినా కేసీఆర్ కలిసి రాలేదు: చంద్రబాబు

  • శేరిలింగం పల్లి నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో
  • ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానన్న ఆరోపణలు తగదు
  • భారతీయ జనతా పార్టీకి తోకపార్టీ టీఆర్ఎస్

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి రోడ్ షోలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలకు నీటి సమస్య లేకుండా చేసుకుందామని తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెబితే పట్టించుకోలేదని, ఆయనకు రాజకీయాలు చేయడం, తనను తిట్టడమే కావాలని విమర్శించారు.

తెలంగాణలో పలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నాడు తెలంగాణలో పలు ప్రాజెక్టులను తానే ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు. గోదావరి జలాల వినియోగం కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేశామని, కలిసి పని చేద్దామని ఎన్నిసార్లు కోరినా కేసీఆర్ కలిసి రాలేదని విమర్శించారు.

నాడు ప్రపంచమంతా తిరిగి హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు వచ్చేలా చేశానని, అదే, తాను స్వార్థపరుడినైతే, ఆ కంపెనీలన్నింటినీ తిరుపతిలో ఏర్పాటు అయ్యేలా చేసేవాడినా కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనలా బండ మాటలు, సంస్కార హీనంగా మాట్లాడనని చంద్రబాబు అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలవడం గురించి ప్రస్తావిస్తూ, దేశ భవిష్యత్ కోసమే జతకట్టామని చెప్పారు. బీజేపీ విధానాలకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతోందని, భారతీయ జనతా పార్టీకి తోకపార్టీ టీఆర్ఎస్ అని విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లవుతుందని, ముస్లింలు ఈ విషయమై ఆలోచించాల్సిన అవసరముందని సూచించారు. 

More Telugu News