Telangana: తెలంగాణలో గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తాం!: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ

  • భూసేకరణ చట్టాన్ని మోదీ, కేసీఆర్ నిర్వీర్యం చేశారు
  • కాంగ్రెస్ రాగానే పూర్తిస్థాయిలో అమలు చేస్తాం
  • భూపాలపల్లి సభలో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నీరుగార్చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్రంలో అటకెక్కించారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు స్థానికులకే దక్కుతాయని అంతా భావించారని రాహుల్ అన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు నిర్వహించిన మహాకూటమి సభలో రాహుల్ మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి రాగానే భూసేకరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. గిరిజనులకు రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అందజేస్తామని ప్రకటించారు. తెలంగాణ కోసం రక్తాన్ని చిందించిన సింగరేణి కార్మికులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తెలంగాణను రూ.17,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఇస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల్లోకి తీసుకెళ్లిందని విమర్శించారు.

More Telugu News