kcr: కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది: టీజేఎస్ అధినేత కోదండరామ్

  • నీళ్లివ్వమని అడిగిన రైతులను అరెస్ట్ చేయిస్తారా!
  • ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం పాటుపడట్లేదు
  • టీఆర్ఎస్ గెలిస్తే మళ్లీ పోలీస్ రాజ్యం వస్తుంది

తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని.. నీళ్లివ్వమని అడిగిన రైతులను అరెస్ట్ చేయించిన ఘనత సీఎం కేసీఆర్ ది అని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మహాకూటమి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, పంటలకు నీళ్లివ్వమని అడిగిన పాపానికి బాల్కొండను జైలుగా మార్చారని, రైతులను అరెస్టు చేశారని మండిపడ్డారు.

 ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం పాటుపడట్లేదని, రైతులు, బీడీ కార్మికుల సమస్యలను గాలి కొదిలేసిందని దుయ్యబట్టారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదని, రుణమాఫీ సక్రమంగా చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే మళ్లీ పోలీస్ రాజ్యం వస్తుందని, అలా జరగకుండా ఉండాలంటే, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
తాము అధికారంలోకొస్తే ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ బహిరంగసభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీ-కాంగ్రెస్ నేతలు తదితరులు హాజరయ్యారు.

More Telugu News