Telangana: ఫాంహౌస్ కు వెళ్లిపోయే కేసీఆర్ కు ఓటేసి మళ్లీ పిలవొద్దు!: కోదండరాం

  • టీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు అన్యాయం
  • వాళ్ల భూములను చెట్ల పేరుతో లాక్కున్నారు
  • భూపాలపల్లి సభలో విమర్శలు గుప్పించిన టీజేఎస్ అధినేత

తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఆరోపించారు. చెట్ల పేరుతో అధికారులు గిరిజనుల భూములను లాక్కుంటే, భూరికార్డుల ప్రక్షాళన పేరుతో చాలామంది అడవి బిడ్డలకు భూములే లేకుండా పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో కౌలు రైతు అన్నవాడు అసలు రైతే కాదన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉందని దుయ్యబట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ రోజు నిర్వహించిన మహాకూటమి సభలో కోదండరాం మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఫాంహౌస్ కు వెళుతున్న కేసీఆర్ ను మళ్లీ ఓటేసి పిలవొద్దని తెలంగాణ ప్రజలకు కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులతో సామాన్యులతో పాటు కార్మికులు, రైతుల జీవితాలను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్..గత నాలుగున్నరేళ్లుగా ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు.

ఈ ఎన్నికల్లో ప్రజాకూటమిని గెలిపిస్తే కుటుంబపాలన ఉండదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టుల కారణంగా నష్టపోయిన ముంపు బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మహాకూటమితోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

More Telugu News