Telangana: పిచ్చి మాటలు, చక్కలిగింతలతో తెలంగాణలో 24 గంటల విద్యుత్ రాలేదు!: సీఎం కేసీఆర్

  • రాష్ట్రం వస్తుందని తొలుత ఎవ్వరూ నమ్మలేదు
  • 24 గంటలూ విద్యుత్ ఇస్తామంటే జానారెడ్డే విమర్శించారు
  • ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి వెల్లడి

తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్న నమ్మకం ఎవ్వరికీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అతికొద్ది మందికి మాత్రమే ప్రత్యేక రాష్ట్రం సాధించగలమన్న విశ్వాసం ఉండేదన్నారు. దేవుడి దయ, ప్రజల ఆకాంక్షలతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ను అందిస్తామంటే స్వయంగా ఇక్కడి కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి ‘ఎట్లా చేస్తరయ్యా’ అంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి కళ్ల ముందు ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీ 58 ఏళ్ల పాలనలో ఓసారి పంట వేస్తే.. మూడుసార్లు మోటార్లు కాలిపోయేవని గుర్తుచేశారు. పిచ్చి మాటలు మాట్లాడితే, చక్కలిగింతలు పెడితే 24 గంటలు కరెంట్ రాలేదనీ, అవిశ్రాంతంగా పనిచేస్తేనే అది సాధ్యమయిందని వ్యాఖ్యానించారు.

గత పాలకులు చేనేత, గీత కార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు. తెలంగాణలో యాదవుల కోసం 75 లక్షల గొర్రెలు తెచ్చి పంచామని సీఎం తెలిపారు. వాటికి 40 లక్షల పిల్లలు పుట్టాయన్నారు. తద్వారా రాష్ట్రంలోని గొల్ల, కురుమ సామాజికవర్గం ప్రజలు రూ.1,500 కోట్ల ఆదాయాన్ని అర్జించారని ముఖ్యమంత్రి అన్నారు. బంగారు తెలంగాణ అన్నది టీఆర్ఎస్ తోనే సాధ్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్ లో చేనేత కార్మికుల కోసం మినీ టెక్స్ టైల్ పార్కు నిర్మాణం అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News