ilayaraja: నా పాటలు పాడే ముందు అనుమతి తీసుకోవాల్సిందే.. లేదంటే చర్యలు తీసుకుంటా!: ఇళయరాజా వార్నింగ్

  • నా పాటలపై ఐపీఆర్‌ఎస్‌ ఫీజులను వసూలుచేస్తోంది
  • ఇకపై దక్షిణాది సినిమా సంఘం దాన్ని సేకరిస్తుంది
  • అనుమతి తీసుకున్నాకే నా పాటల్ని పాడాలి

స్వర మాంత్రికుడు ఇళయరాజాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయన ప్రపంచవ్యాప్తంగా టూర్లు నిర్వహించి అభిమానులను అలరిస్తుంటారు. దీంతోపాటు ఇళయరాజా పాటలను చాలామంది గాయనీ గాయకులు ఆలపిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారందరికీ ఇళయరాజా కీలక సూచన చేశారు. ఏ కార్యక్రమంలో అయినా తాను స్వరపరిచిన పాటలు పాడే ముందు తన అనుమతి తీసుకోవాలని తెలిపారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

‘నా పాట‌లు పాడే ముందు ఓ సారి నా అనుమ‌తి తీసుకోండి. లేదంటే మ్యుజీషియన్స్‌తో పాటు బ్యాండ్‌ సభ్యులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నేను ఐపీఆర్‌ఎస్‌(ఇండియన్‌ పెర్ఫార్మింగ్‌ రైట్స్‌ సొసైటీ)లో సభ్యుడిని కాకున్నా నా పాటలు పాడుతున్న వారి నుంచి రాయల్టీ ఫీజును ఐపీఆర్‌ఎస్‌ వసూలు చేస్తోంది.

ఇక నుండి అలా జ‌ర‌గ‌డానికి వీలు లేదు. ఇకపై ఆ ఫీజును ద‌క్షిణ సినిమా సంగీత క‌ళాకారుల సంఘం సేక‌రిస్తుంది. భ‌విష్య‌త్ త‌రాలకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది’ అని ఇళయరాజా వ్యాఖ్యానించారు. గతంలో కచేరీలు, సంగీత కార్యక్రమాల్లో తన పాటను పాడొద్దని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇళయరాజా నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

More Telugu News