India: నాణ్యత లేని కొత్త నోట్లు... ప్రజలకు కొత్త పరేషాన్!

  • డబ్బును స్వీకరించని డిపాజిట్ మెషీన్లు
  • తమ వద్దకు వస్తే చలామణిలోకి పంపని బ్యాంకులు
  • తిరిగి రిజర్వ్ బ్యాంక్ కు చేరుతున్న కరెన్సీ

రెండేళ్ల క్రితం చలామణిలోకి వచ్చిన రూ. 500, రూ. 2000 నోట్లతో పాటు, గతేడాది వచ్చిన రూ. 200 సహా రూ. 50, రూ. 10 నోట్లు నాసిరకంగా ఉన్నాయని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి దశలో వచ్చిన రూ. 2000, రూ. 500 నోట్లను డబ్బు డిపాజిట్ చేసుకునే మెషీన్లు స్వీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు వీటిని బ్యాంకుల్లో జమ చేస్తుండగా, బ్యాంకులు సైతం ఈ నోట్లను తిరిగి వ్యవస్థలోకి పంపకుండా, పక్కనబెట్టి, జారీ చేయడానికి అనువుగా లేవని తేల్చుతూ ఆర్బీఐకి పంపుతున్నాయని ఓ హిందీ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కొత్త నోట్లను ఏటీఎం సెన్సర్లు గుర్తించలేకున్నాయని తెలిపింది.

వాస్తవానికి పాత రూ. 500, రూ. 1000 నోట్లు తడిసినా, నలిగినా వినియోగానికి మెరుగ్గా ఉండేవి. అయితే, కొత్త నోట్లు మాత్రం ఆ స్థాయి నాణ్యతతో లేవని ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా, కొత్త నోట్ల నాణ్యతపై వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. తామేమీ నాణ్యత విషయంలో రాజీ పడటం లేదని, నోట్లు పనికిరాకపోవడానికి చాలా కారణాలుంటాయని తెలిపింది. వీటిని బాగా మడిచి దాచుకోవడం, చీరకొంగులు, పంచెల్లో ముడివేయడం వల్ల నలిగిపోయి, వినియోగించుకునే విషయంలో ఇబ్బందులు వచ్చి వుండవచ్చని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News