Rahul Gandhi: కేసీఆర్ ఆదేశాల మేరకే పార్లమెంటులో మోదీకి సహకరిస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారు: రాహుల్ గాంధీ

  • పార్లమెంటులో ప్రతి బిల్లుకు మోదీకి కేసీఆర్ మద్దతిచ్చారు
  • ఆరెస్సెస్, సంఘ్ పరివార్ కు కేసీఆర్ సహకారం ఉంది
  • ఇప్పుడు కేసీఆర్ ను, 2019లో మోదీని ఇంటికి పంపుదాం

లోక్ సభ, రాజ్యసభలలో మోదీకి అవసరం వచ్చినప్పుడల్లా కేసీఆర్ పూర్తిగా మద్దతిచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని విభజించే పనిలో మోదీ ఎప్పుడూ నిమగ్నమై ఉంటారని విమర్శించారు. దేశ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడతారని... వీటన్నింటికీ కేసీఆర్ మద్దతు ఉందని ఆరోపించారు. రైతులకు అనుకూలంగా ఉండే భూసేకరణ బిల్లుకోసం పార్లమెంటులో తాము పోరాటం చేస్తున్నప్పుడు కూడా... తమకు వ్యతిరేకంగా, మోదీకి అనుకూలంగా టీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించారని మండిపడ్డారు.

పార్లమెంటులో ఆమోదం పొందిన ప్రతి బిల్లుకు నరేంద్ర మోదీకి కేసీఆర్ మద్దతు పలికారని విమర్శించారు. ఆరెస్సెస్, సంఘ్ పరివార్ కు కూడా కేసీఆర్ సంపూర్ణ మద్దతు పలికారని అన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని... దాని పేరు తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్ అని ఎద్దేవా చేశారు. కొడంగల్ బహిరంగసభలో మాట్లాడుతూ, రాహుల్ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

పార్లమెంటులో ప్రతి బిల్లుకు మోదీకి ఎందుకు మద్దతు పలుకుతున్నారని తాను టీఆర్ఎస్ ఎంపీలను అడిగానని... కేసీఆర్ నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని, అందుకే మద్దతు పలుకుతున్నామని తనతో వారు చెప్పారని రాహుల్ అన్నారు. మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒకే తాను ముక్కలని మోదీ అన్నారని... అదే నిజమైతే పార్లమెంటులో రాఫెల్ కుంభకోణం వంటి ఎన్నో అంశాలపై తాము పోరాడామని... మరి తమతో టీఆర్ఎస్ ఎందుకు కలసి రాలేదని ప్రశ్నించారు.

తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాబోతోందని... మీ ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చబోతోందని రాహుల్ చెప్పారు. వీరు కలలుగన్న నీళ్లు, నిధులు, నియామకాలను కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తుందని అన్నారు. ముందు మనం ఇక్కడ కేసీఆర్ ను ఓడిద్దామని, 2019లో జాతీయ స్థాయిలో మోదీని ఇంటికి పంపుదామని పిలుపునిచ్చారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీగఢ్, తెలంగాణ, మిజోరాంలలో బీజేపీ, టీఆర్ఎస్ ల కూటమిని చిత్తు చేద్దామని చెప్పారు. 

More Telugu News