BSNL: అయ్యప్ప దగ్గరకు దాదాపు వెళ్లిన రెహానా... అరెస్టయిన మరుసటి రోజే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగింపు!

  • ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన బీఎస్ఎన్ఎల్
  • గతంలో సన్నిధానం వరకూ వెళ్లిన రెహానా
  • భక్తుల నిరసనలతో వెనక్కు

ప్రజల మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై, శబరిమలలోని అయ్యప్ప సన్నిధానానికి అత్యంత దగ్గరగా వెళ్లి, వెనుదిరిగి వచ్చిన ముస్లిం యువతి రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే, ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రెహానా బీఎస్ఎన్ఎల్ లో టెలికం టెక్నీషియన్ గా పని చేస్తుండగా, ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు మంగళవారం నాడు ఉత్తర్వులు వెలువడ్డాయి. సెప్టెంబర్ 30న ఫాతిమా, తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్టు పెడుతూ 'తత్వమసి' అని క్యాప్షన్ రాసి, నల్ల దుస్తులు ధరించిన చిత్రాన్ని ఉంచిన సంగతి తెలిసిందే.

ఆపై ఆమె నీలక్కల్ కు చేరుకోగా, పోలీసుల భద్రత నడుమ ఆమెను సన్నిధానం వరకూ తీసుకెళ్లగలిగారు. భక్తుల నిరసనలతో ఆమె వెనుదిరిగి రాగా, ఆ తరువాత ఆమె మైల బట్టలు ఇరుముడిలో పెట్టుకు వచ్చిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె నివాసాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నాశనం చేశారు. రెహానాను ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఆమె తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంది. కాగా, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు శబరిమలకు అన్ని వయసుల మహిళలూ వెళ్లవచ్చని తీర్పిచ్చిన తరువాత, రుతుస్రావం వయసులో ఉన్న ఏ మహిళా స్వామిని దర్శించుకోలేదు.

More Telugu News