Chandrababu: మోదీకి ఎన్ని నాలుకలు ఉన్నాయో చూడండంటూ వీడియోలను చూపించిన చంద్రబాబు!

  • చివరి బడ్జెట్ లో కూడా అన్యాయం జరిగినందుకే.. అవిశ్వాసం పెట్టాము
  • ప్రధాని స్థాయి వ్యక్తి అవకాశవాద, బెదిరింపు రాజకీయాలు చేయకూడదు
  • మోదీని చూస్తే జగన్ కు వెన్నులో వణుకు పుడుతుంది

చివరి కేంద్ర బడ్జెట్ లో కూడా ఏపీకి అన్యాయం జరిగిందని... అందుకే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీయేలో చేరితే... దారుణంగా మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అవిశ్వాస తీర్మానంలో చర్చ సందర్భంగా తన కంటే కేసీఆర్ కే ఎక్కువ మెచ్యూరిటీ ఉందని మోదీ వ్యాఖ్యానించారని... వైసీపీ ట్రాప్ లో తాను పడ్డానని అన్నారని మండిపడ్డారు. విజయనగరంలో నిర్వహించిన ధర్మపోరాట సభలో ప్రసంగిస్తూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో, తిరుపతిలో మోదీ రకరకాల మాటలు చెప్పారని... ఆయనకు ఎన్ని రకాల నాలుకలు ఉన్నాయో చూడండని వీడియోలను చూపించారు.

ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అవకాశవాదంతో, బెదిరింపులతో రాజకీయాలు చేయకూడదని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎంపీలను బెదిరించారని... ఈడీ, సీబీఐ, ఐటీల ద్వారా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని మోదీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని, బుందేల్ ఖండ్ మాదిరి ప్యాకేజీ ఇస్తామని, రెవెన్యూ లోటు కింద రూ. 16 వేల కోట్లు ఇస్తామని... ఇలా ఎన్నో మాటలు చెప్పారని అన్నారు. బీజేపీ నేతలు రాయలసీమ డిక్లరేషన్ అంటారు కానీ... కడప స్టీల్ ప్లాంట్ గురించి మాత్రం మాట్లాడరని ఎద్దేవా చేశారు.

కోడికత్తి డ్రామా ఆడుతున్న జగన్ సొంత జిల్లాలో స్టీల్ ప్లాంటు గురించి ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. మోదీని చూస్తే జగన్ కు వెన్నెముకలో వణుకు మొదలవుతుందని ఎద్దేవా చేశారు. డిసెంబర్ లో కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని చెప్పారు.

More Telugu News