kcr: కేసీఆర్ కు ఇక్కడి జైళ్లు సరిపోవు.. అండమాన్ జైల్లో పెట్టాలి: రేవంత్ రెడ్డి

  • మందుపోసుకొచ్చి మాట్లాడే కేసీఆర్.. చంద్రబాబుపై మూడో కన్ను తెరుస్తారట
  • తాగి రాష్ట్రాన్ని నడిపే వ్యక్తిని ఎలా భరించాలి
  • కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే.. లక్ష ఉద్యోగాలు ఇస్తాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మూడోకన్ను తెరుస్తాన్నావ్... ఏది ఒకసారి తెరువు, చూస్తామంటూ సవాల్ విసిరారు. మందు పోసుకొచ్చి మాట్లాడే కేసీఆర్ చంద్రబాబుపై మూడో కన్ను తెరుస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని జైలుకు పంపుతున్నారని... తాగి రాష్ట్రాన్ని నడిపే వ్యక్తిని ఎలా భరించాలని అన్నారు. ఇలాంటి వాళ్లను ఇక్కడి జైళ్లలో కాకుండా అండమాన్ జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించారు. మహాకూటమి అభ్యర్థి సీతక్క తరపున ఈరోజు ఆయన ములుగులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

తెలంగాణ వస్తే సమ్మక్క సారక్కకు మొక్కు చెల్లిస్తానని చెప్పిన కేసీఆర్... సమ్మక్క జాతరకు ఎందుకు రాలేదని రేవంత్ ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్కడి ఉద్యోగం ఊడగొడితే 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. బ్యాంకులకు ఒక్క రూపాయి అప్పుకూడా కట్టకండని... మహాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని... సుపరిపాలన అందించే కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. పోడు భూముల సమస్య సీతక్క ద్వారా తీరబోతోందని అన్నారు. నీరు, నిధులు, నియామకాలు అని చెప్పిన వారు ఎన్ని నీళ్లు తెచ్చారో? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో? చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News