Kurnool District: ఎన్ని వివాదాలో అంత భక్తగణం కూడా... బాల సాయిబాబా జీవిత విశేషాలు!

  • 18వ ఏటనే కర్నూలులో తొలి ఆశ్రమం
  • మెడిసిన్, ఫిలాసఫీ విద్యలు అభ్యసించిన బాలసాయి
  • పలు అవార్డులిచ్చి సత్కరించిన విదేశాలు

తన 18వ ఏటనే కర్నూలు ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులకు ఇలవేల్పుగా మారిన బాల సాయిబాబా మరణం, ఆయన భక్తులను తీవ్ర ఆవేదనలో ముంచెత్తింది. ఈ ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారు.

1960 జనవరి 14న కర్నూలులో జన్మించిన బాలసాయి, చిన్నతనం నుంచే శ్రీ రమణ మహర్షి బోధనలతో ఆథ్యాత్మికత వైపు మళ్లినట్టు చెబుతుంటారు. మెడిసిన్, ఫిలాసఫీ విద్యలు అభ్యసించిన ఆయనకు నృత్య, గాత్ర కళల్లోనూ ప్రావీణ్యం ఉంది. తన 18వ ఏట ఆశ్రమాన్ని స్థాపించిన ఆయన బోధనల పట్ల ఎంతో మంది  ఆకర్షితులయ్యారు.

కర్నూలు ప్రాంతంలో పాఠశాలలు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించడంలో నిధులిచ్చిన ఆయనకు డాక్టర్ ఆఫ్ డివైనిటీ (ఇటలీలోని గ్లోబల్ ఓపెన్ యూనివర్శిటీ), అంబాసిడర్ ఆఫ్ పీస్ (ఐరాస), ఆననరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లాస్ (నెదర్లాండ్స్ గ్లోబల్ పీస్ వర్శిటీ), ఆనరరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఫ్రాన్స్, యూనివర్శిటీ ఆఫ్ లిబ్రీ డెస్ సైన్స్) గౌరవాలు దక్కాయి. రాయ్ పూర్ లోని కళింగ యూనివర్శిటీకి బాలసాయి వైస్ చాన్స్ లర్ గానూ విధులు నిర్వర్తించారు.

ఇక ఆయన ఎంత ఆధ్యాత్మికవేత్తో, అన్ని వివాదాలూ ఆయన్ను చుట్టుముట్టాయి. అనంతపురంలో గుప్త నిధులను దక్కించుకున్నారన్నది ఆయనపై వచ్చిన తొలి ఆరోపణ.. ఆ డబ్బుతోనే ఆయన ఆశ్రమాలు స్థాపించాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసు కేసులు కూడా ఉన్నాయి. గాల్లోంచి చిన్న చిన్న బంగారు ఆభరణాలను తీసి భక్తులకు ఇవ్వడం, చేతి నుంచి విభూది రాల్చడం, శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాన్ని బయటకు తీయడం వంటి పనులతో ఆయన భక్తులను ఆకట్టుకునేవారు. పలువురి స్థలాలను ఆయన అన్యాక్రాంతం చేశారన్న కేసులూ విచారణ దశలో ఉన్నాయి.

వివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వెలిబుచ్చారు.

More Telugu News