KCR: ప్రతీ ఊరిలో లిక్కర్ లారీలు దిగుతున్నాయి.. 'కార్యకర్తల నాయుడు' ప్యాకేజీలు పెట్టి కొంటున్నాడు!: సీఎం కేసీఆర్

  • బీడీ కార్మికులను ఆదుకున్నాం
  • పెన్షన్ ను రెండింతలు చేస్తాం
  • నిజమాబాద్ సభలో కేసీఆర్ వెల్లడి

బీడీ కార్మికులకు దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని పోరాటాలు చేసినా వారి సమస్యలు పరిష్కారం కాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పెద్దపెద్ద నేతలు ఉన్నా ఒక్కరు కూడా కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. దేశ చరిత్రలో తొలిసారి బీడీ కార్మికులకు రాష్ట్రంలో నెలకు రూ.1,000 పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మరో రూ.వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమ్మాయి పుడితే రూ.13,000, అబ్బాయి పుడితే రూ.12 వేలు అందజేస్తున్నామని వ్యాఖ్యానించారు. చిన్నారుల కోసం కేసీఆర్ కిట్ అందజేస్తున్నామన్నారు. అవ్వాతాతలకు పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా పథకాలతో తెలంగాణను సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దామని అభిప్రాయపడ్డారు.

ఇన్ని అభివృద్ధి పథకాలు, పనులు చేపడుతుంటే విపక్షాలకు ఓటేయాల్సిన అవసరం ఏముందని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల వేళ విపక్ష నేతలు ఊరికి ఓ లారీ చొప్పున చీప్ లిక్కర్ మద్యాన్ని దించుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కార్యకర్తల నాయుడు(చంద్రబాబు) ప్యాకేజీలు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నాడని విమర్శించారు.

ఈ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమయం అవుతుందనీ, జనరేటర్ల అమ్మకాలు పెరుగుతాయని సెటైర్లు విసిరారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తెలివి, దమ్ము లేదనీ, అందుకే ఆంధ్రా సీఎం చంద్రబాబును భుజాలపై కూర్చోబెట్టుకుని తీసుకొచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టుపై చంద్రబాబు 30 ఉత్తరాలు, 65 కేసులు పెట్టారని గుర్తుచేశారు.

More Telugu News